కమలా హ్యారిస్ విజయం కోసం.. ఇండియాలోని ఆమె పూర్వీకుల పూజలు!
- నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న కమలా హ్యారిస్
- దక్షిణ భారతదేశంలోని కమల పూర్వీకులు ఆమె విజయాన్ని కోరుతూ పూజలు
- తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు
కమలా హ్యారిస్ తాతగారు పీవీ గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామంలో జన్మించారు. ఇక్కడి ఓ ఆలయంలోనే మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ సమీపంలో చిన్న దుకాణం నిర్వహిస్తున్న గ్రామస్థుడు జి.మణికందన్ తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే తాము సంబరాలు చేసుకుంటామని ఆయన చెప్పారు.
2020లో కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున విజయం సాధించగా ఇదే గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. అప్పుడు కూడా ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ఏకంగా ఆమెకు ఉపాధ్యక్ష పదవి దక్కడంతో వారి సంబరాలు అంబరాన్నంటాయి. ఆమె పదవీ స్వీకారోత్సవాన్ని ఘనంగా జరుపుకుని, బాణసంచా కాల్చి, భోజనాలు పెట్టారు. తద్వారా ఈ గ్రామం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.