త్వరలోనే నదులను అనుసంధానం చేస్తాం: చంద్రబాబు
- విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
- దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్న సీఎం
- దుర్గ గుడిలో ఈసారి సేవా కమిటీని వేశామని వెల్లడి
దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. దుర్గ గుడిలో ఈసారి ఉత్సవ కమిటీని కాకుండా... సేవా కమిటీని వేశామని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 67,931 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. త్వరలోనే నదుల అనుసంధానం ఉంటుందని తెలిపారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తికావాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.
మరోవైపు, దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చిన్నరాజగోపురం వద్ద ముఖ్యమంత్రి తలకు అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆ తర్వాత మేళతాళాల మధ్య అమ్మవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.