మూసీ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నా ఇళ్లు ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయని మూసీవాసులు
- ఇప్పటి వరకూ 40 శాతం మందే ఇళ్లు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లిన వైనం
- ఈ రోజు, రేపు ప్రతి నిర్వాసిత కుటుంబాన్ని కలిసి ఇబ్బందులు తెలుసుకోనున్న రెవెన్యూ అధికారులు
అయితే ప్రభుత్వం కేటాయిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తమకు సమీపంలోనే రెండు మూడు కిలో మీటర్ల దూరంలో కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్‌నగర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లిగుడెసెలు, జియాగూడ, నార్సింగి ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు.
ఇప్పటి వరకూ 40 శాతం మంది మాత్రమే ఇళ్లు ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో ఇళ్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్న 60 శాతం మంది కుటుంబాల ఇబ్బందులను తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఈరోజు, రేపు ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని భావిస్తున్నారు.