మీ కష్టాలను గట్టెక్కించే బాధ్యత మాదే: ఖమ్మం వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy tour in Khammam
ఇది చాలా బాధాకరమైన సందర్భం... భారీ వర్షం... వరద మీ జీవితల్లో విషాదాన్ని తెచ్చిపెట్టింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కుటుంబాలకు అందుబాటులో ఉండి కష్టాలను గట్టెక్కించే బాధ్యత తమదేనన్నారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం ఈరోజు పర్యటించారు. 

అనంతరం ఆయన ప్రాణ, ఆర్థిక నష్టానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం ఇస్తామన్నారు. వరదల్లో ధృవపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేయాలని... నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామన్నారు.

వరద బాధితులకు తక్షణ రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు. పశువులు మరణిస్తే రూ.50 వేలు... గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేల చొప్పున ఇస్తామన్నారు.

ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మిస్తామన్నారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మంత్రులు, అధికారులు రోజంతా వరద బాధితుల కోసమే కష్టపడుతున్నారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిద్ర లేకుండా శ్రమిస్తున్నారని తెలిపారు. దాదాపు గత డెబ్బై ఏళ్లలో ఇంతటి వర్షాన్ని చూడలేదని పెద్దలు చెబుతుంటే తెలిసిందన్నారు. భారీ వర్షాల వల్ల రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కష్టపడి కొనుకున్న నిత్యావసర వస్తువులు సహా అన్నీ నీటి పాలయ్యాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి బియ్యం, ఉప్పు, పప్పులు, మంచినీరు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద నష్టాన్ని అంచనా వేస్తారన్నారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ధైర్యం చెప్పారు.
Go Back to Shorts
Revanth Reddy
Khammam District
Rain
Telangana

More Telugu News