ఢిల్లీలో భారీ వర్షాలు.. వరదకు నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. విద్యార్థి మృతి
- రాజేందర్‌నగర్‌లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద
- వరదలో చిక్కుకుపోయిన విద్యార్థులు,
- రంగంలోని ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, ఓ విద్యార్థి మృతదేహం వెలికితీత
- పరారీలో కోచింగ్ సెంటర్ యజమాని, ప్రమాదానికి ఆప్ బాధ్యత వహించాలన్న బీజేపీ
ప్రమాదంపై ఢిల్లీ మంత్రి ఆతిషీ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరగాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు. ప్రమాదంపై 24 గంటల్లోగా నివేదిక సిద్ధం చేయాలని కూడా అన్నారు.
ఘటనపై మరో అధికారి స్వాతి మలివాల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో చిక్కుకుని ఓ ఐఏఎస్ విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమని, విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులెవరో తేల్చి చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా, ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, ఎంపీ బాన్సురీ స్వరాజ్.. ఈ ప్రమాదానికి ఆప్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నాలాలు సరిగా శుభ్రపరచకపోవడంతోనే నీరు ఎగదన్ని బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తిందని అన్నారు. నేరపూరిత నిర్లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమైందని దుయ్యబట్టారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ వాటర్ బోర్డు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.