ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు.. అప్రజాస్వామ్యపాలన: హరీశ్ రావు
- టీజీపీఎస్‌సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన బీఆర్ఎస్ నేత
- నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అణగదొక్కుతోందని మండిపాటు
- సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టేది లేదని వ్యాఖ్య
- అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్
ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అణగదొక్కుతోందని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదని, అప్రజాస్వామ్యపాలన అని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకుని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.
సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టేది లేదని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరపున గొంతెత్తుతామని స్పష్టం చేశారు. నిర్విరామ పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధించిన వారిని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.