భారత్‌తో సత్సంబంధాలకు పాక్ సంకేతాలు
- శాశ్వత శత్రుత్వాన్ని పాక్ విశ్వసించబోదన్న ఆ దేశ డిప్యూటీ పీఎం
- భారత్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని ఇషాక్ దార్ ఆశాభావం
- అంతమాత్రాన ఏకపక్ష, ఆధిపత్య విధానాలను అంగీకరించబోమని స్పష్టీకరణ
ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇస్లామాబాద్ (ఐఎస్ఐఎస్)లో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలతో పాకిస్థాన్ ఎప్పుడూ మంచి సంబంధాలనే కోరుకుంటుందని 74 ఏళ్ల ఇషాక్ దార్ పేర్కొన్నారు.
‘‘తూర్పున ఉన్న భారతదేశంతో సంబంధాలు చారిత్రక సమస్యగా మారాయి. పాకిస్థాన్ శాశ్వత శత్రుత్వాన్ని ఎన్నడూ విశ్వసించదు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, జమ్మూకశ్మీర్‌పై దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మక చర్చలను పాకిస్థాన్ కోరుకుంటోందని, అంతమాత్రాన ఏకపక్ష, భారత్ ఆధిపత్య విధానాలను మాత్రం పాకిస్థాన్ ఎప్పటికీ అంగీకరించబోదని దార్ తేల్చి చెప్పారు.