కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. ప్రమాదస్థలి గుర్తింపు!
- యూఏవీలతో ప్రమాదస్థలిని గుర్తించిన ఐఆర్‌సీఎస్
- ఘటనా స్థలంలో బతికున్న వారి ఆనవాళ్లు ఏవీ లేవని వెల్లడి
- ఇప్పటికే నాలుగు బృందాలు ఘటనా స్థలి సమీపానికి చేరుకున్నట్టు ప్రకటన
- ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు
తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు శ్రమిస్తున్నాయి. పొగమంచు, వర్షం తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నాయి.
గాలింపు చర్యల కోసం 46 దళాలను రంగంలోకి దింపినట్టు ఐఆర్సీఎస్ పేర్కొంది. హెలికాఫ్టర్ కూలినట్టుగా అనుమానిస్తున్న ప్రదేశంలో సమీపానికి నాలుగు బృందాలు చేరినట్టు ఐఆర్సీఎస్ అధిపతి రజీహ్ అలిష్వాండి ఆదివారం రాత్రి వెల్లడించారు. ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖోదావరిన్ అనే రెండు డ్యామ్‌లను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో అధ్యక్షుడితో పాటు ఓ మంత్రి సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.