Anchor Shyamala: పిఠాపురంలో వంగా గీత గెలుపు ఎప్పుడో ఖాయమైంది... ఇప్పుడు భారీ మెజారిటీపైనే దృష్టి: యాంకర్ శ్యామల

Anchor Shyamala campaigns for YCP Candidate Vanga Geetha in Pithapuram
  • పిఠాపురంలో వైసీపీ తరఫున యాంకర్ శ్యామల ప్రచారం
  • వంగా గీతకే ప్రజల మద్దతు అని స్పష్టీకరణ
  • కేవలం జనాల కోసమే పనిచేస్తున్న పార్టీ వైసీపీ అని వెల్లడి 
ప్రముఖ నటి, యాంకర్ శ్యామల నేడు పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన భర్త నర్సింహతో కలిసి వచ్చిన యాంకర్ శ్యామలను మీడియా పలకరించింది. శ్యామల మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. చెప్పేవాళ్లు చాలా చెప్పుకుంటున్నారని, కానీ జరిగేది జరుగుతుంది... మనం చూస్తాం అని స్పష్టం చేశారు. 

పవన్ కు మద్దతుగా, వంగా గీతను ఓడించడం కోసం చాలా మంది సినీ ప్రముఖులు పిఠాపురం వచ్చారు కదా... ఒక మహిళను ఓడించేందుకు ఇంతమంది అవసరమంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటని శ్యామలను ప్రశ్నించగా... వైసీపీ అభ్యర్థి వంగా గీత కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎంపీ వరకు ఎదిగారని కొనియాడారు. ఆమె ఏ పదవిలో ఉన్నా, తన ప్రజలకు చేతనైనంత సేవ చేశారని తెలిపారు. మరి వంగా గీత వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే ఆ మాత్రం సపోర్ట్ కావాలి అని యాంకర్ శ్యామల వ్యాఖ్యానించారు. 

పవన్ కల్యాణ్ భారీ ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే, అతడి కోసం జబర్దస్త్ టీమ్ పనిచేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు కూడా శ్యామల బదులిచ్చారు. "వాళ్లు పనిచేస్తున్నారంటే రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల ఒత్తిళ్లు ఉండొచ్చు. నేను ఒక విషయం కచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను... పిఠాపురంలో వంగా గీత గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. నేను ఇవాళ ప్రచారంలో చేరడానికి గానీ, నేను మళ్లీ వచ్చి ఆమెను కలవడానికి గానీ, ఇంకొంచెం ప్రయత్నం చేయడానికి గానీ కారణం... భారీ మెజారిటీ సాధించడం కోసం. 

కూటమి మేనిఫెస్టోలో పెద్దన్న బీజేపీ ఫొటో లేదు... ఇద్దరి ఫొటోలే ఉన్నాయి. ఇవాళ ఒక న్యూస్ పేపర్లో మేనిఫెస్టో ప్రకటన చూస్తే అందులో ఒక ఫొటోనే ఉంది, మరొకరి ఫొటో లేదు... ఇలా మైనస్ లు అవుతూ వస్తున్నాయి... అవి వైసీపీకి ప్లస్ లు అవుతూ వస్తున్నాయి. కేవలం జనాల కోసమే పనిచేస్తున్న పార్టీ... వైసీపీ. ప్రజల్లో ఈ మేరకు స్పష్టత ఉంది" అని యాంకర్ శ్యామల వివరించారు.
Anchor Shyamala
Pithapuram
Vanga Geetha
Pawan Kalyan
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News