రేవంత్ రెడ్డి వద్ద సరుకులేదు... అందుకే లీకు, ఫేకు వార్తలు: హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డి వద్ద సరుకులేదు... అందుకే లీకు, ఫేకు వార్తలు: హరీశ్ రావు

Harish Rao satire on Revanth Reddy
  • బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శ
  • కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకి ఓటేస్తే నష్టపోతామని హెచ్చరిక
  • మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సరుకులేదని, అందుకే ఆయన వద్ద అన్నీ లీకు, ఫేకు వార్తలేనని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ రెండూ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. బీజేపీని గెలిపించేందుకు కొన్నిచోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందని మండిపడ్డారు. కరీంనగర్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ వంటి చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మనం నష్టపోతామని హెచ్చరించారు.

బీజేపీ బడేమియా... కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. రెండూ అబద్ధాల పార్టీలే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కావడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలలకే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ పార్టీలోనూ లుకలుకలు ప్రారంభమయ్యాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదని విమర్శించారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే వాటిని కొనేది లేదని బీజేపీ చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. నిరుద్యోగ భృతిపై కూడా మాట తప్పారని విమర్శించారు. సిద్దిపేటకు అవార్డులు రావడానికి కారణం నాడు కలెక్టర్‌గా ఉన్న ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డే అని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్‌కు సిద్దిపేట కంచుకోట అని, లోక్ సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు.
Advertisement
Harish Rao
BJP
Lok Sabha Polls

More Telugu News