కవితకు మళ్లీ కస్టడీనా? .. బెయిలా? .. తీవ్ర ఉత్కంఠ!

Tension on Kavitha Custody extension
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ మరుసటి రోజు ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత శనివారం ఆమెను మళ్లీ కోర్టులో ప్రవేశ పెట్టిన ఈడీ అధికారులు కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో, ఆమె కస్టడీని కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ క్రమంలో మొత్తం 10 రోజుల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 

కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో, ఈ ఉదయం 11 గంటల సమయంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు, కవిత బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెను మళ్లీ ఈడీ కస్టడీకి ఇస్తుందా? లేక జ్యుడీషియల్ కస్టడీ విధిస్తుందా? లేక బెయిల్ మంజూరు చేస్తుందా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు, ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న రాత్రి విచారణ ముగిసిన అనంతరం.. ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పీఏ శరత్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. దాదాపు గంట సేపు ఆమెతో వీరు మాట్లాడారు. కవిత యోగక్షేమాలను తెలుసుకున్న భర్త అనిల్... ఆమెకు ధైర్యం చెప్పినట్టు సమాచారం. 

Go Back to Shorts
K Kavitha
BRS
Delhi Liquor Scam
Enforcement Directorate

More Telugu News