రెపో రేటు యథాతథం.. ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయం
- వరుసగా ఆరవసారి 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించిన ఆర్బీఐ ఎంపీసీ కమిటీ
- ఆర్థిక వృద్ధికి ఊతం, ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యమని వెల్లడి
- వడ్డీ రేట్ల విషయంలో సర్దుబాటు వైఖరిని కొనసాగిస్తామన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేయడమే ఆర్బీఐ లక్ష్యమని శక్తికాంత దాస్ అన్నారు. ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొంటున్నాయని, పంపిణీ వ్యవస్థపై ఈ ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది సాధారణ వర్షపాతం నమోదైతే ఆర్థిక సంవత్సరం 2024-25లో వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పరిధి లక్ష్యానికి అనుగుణంగా వడ్డీ రేట్లను సర్దుబాటు చేయనున్నామని పేర్కొన్నారు.