ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం.. పులివెందుల పంచాంగం: అచ్చెన్నాయుడు
- తన భద్రతపైనే తప్ప జగన్ కు శాంతిభద్రతలపై శ్రద్ధ లేదని విమర్శ
- రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
- తహసీల్దార్ రమణయ్య హత్యే నిదర్శనం
- వైసీపీ నేతల అవినీతిని అడ్డుకున్న అధికారులకు వేధింపులు
- ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపణలు
ఐదేళ్లలో భూకజ్జాలు, ఆస్తుల విధ్వంసం, కమీషన్లు, సెటిల్ మెంట్లకు అడ్డాగా విశాఖను మార్చేశారని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అవినీతి, అరాచకాలకు అడ్డుతగిలిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
గతంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మార్వో లక్ష్మీనారాయణరెడ్డిపై వైసీపీ నేత చెంచు రెడ్డి ఎమ్మార్వో ఆఫీసులో బహిరంగంగా దాడి చేశాడు. మంత్రుల నుంచి వాలంటీర్ల వరకు అధికారులపై దాడులు, బూతులతో విరుచుకుపడుతున్నారు. తన అవినీతి పనులకు సహకరించలేదన్న కోపంతో దళిత కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దౌర్జన్యం చేశారని, బదిలీ చేయించారని అచ్చెన్నాయుడు తెలిపారు. గుడివాడలో భూకబ్జాను అడ్డుకున్న వీఆర్వోను జేసీబీతో తొక్కి చంపేందుకు కొడాలి నాని అనుచరులు యత్నించారని అన్నారు. శాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి శాఫ్ అధికారులను మీటింగ్ లో అహంకారపూరితంగా ఇష్టమెచ్చినట్టు మాట్లాడి అగౌరవపరిచారు.
కార్ పార్కింగ్ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులను బండబూతులు తిట్టిన ఘటనను టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాలో విద్యుత్ ఉద్యోగిపై వైసీపీ నాయకులు బహిరంగంగా దాడి చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, వాలంటీర్ల దాడులు, దౌర్జన్యాలకు లెక్కేలేదని విచారం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వేధించడానికి మాత్రమే పోలీసులను ఉపయోగించుకుంటున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.