ఆలయంలోకి అనుమతించని సిబ్బంది.. నడి రోడ్డుపై కూర్చుని రాహుల్ గాంధీ నిరసన
- అసోంలోని బటద్రవ ఆలయంలోకి రాహుల్ కు నో ఎంట్రీ
- తాను చేసిన నేరమేమిటని ప్రశ్నించిన కాంగ్రెస్ మాజీ చీఫ్
- పై నుంచి ఒత్తిడి వల్లే తనను అడ్డుకున్నారంటూ ఆరోపణ
- అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఘటన
దీనిపై నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో కలిసి నడి రోడ్డుపైనే బైఠాయించారు. ఆలయంలోకి అనుమతించకుండా అడ్డుకునేంత నేరం తాను ఏం చేశానో చెప్పాలని అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. ఆలయంలో గొడవలు సృష్టించడం తమ అభిమతం కాదని, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్లిపోతామని చెప్పినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు. తనను లోపలికి అనుమతించ వద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే ఆలయ కమిటీ అడ్డుకుందని విమర్శించారు.
చివరకు ఆలయంలోకి ఎవరు వెళ్లాలి.. ఎవరు వెళ్లకూడదనేది కూడా ప్రధాని నరేంద్ర మోదీయే నిర్ణయిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా బటద్రవలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందు ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. రామ జన్మభూమిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు రాహుల్ గాంధీ బటద్రవకు వెళ్లకూడదని సూచించారు. దీనివల్ల ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ్ యాత్ర రూట్ మార్చుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు.