Jeevan Reddy: కవిత ఎన్ని గుడులను కాపాడింది?: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

Jeevan Reddy counter to Kavitha Hindu religion comments
  • కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేకత ఉందని కవిత విమర్శలు
  • తాము హిందూమతంతో పాటు అన్ని మతాలను గౌరవిస్తామన్న జీవన్ రెడ్డి
  • జగిత్యాలలో రామాలయం ఆక్రమణకు గురి కాకుండా చూశానన్న జీవన్ రెడ్డి
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బతుకమ్మ ఆడగానే హిందూమతాన్ని గౌరవించినట్లు అవుతుందా? అని చురక అంటించారు. అసలు కవిత ఏ మతాన్ని గౌరవిస్తుందో చెప్పాలి? అని ప్రశ్నించారు. తాము హిందూమతంతో పాటు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని పేర్కొన్నారు. కవిత ఇప్పటి వరకు ఎన్ని గుడులను కాపాడిందో చెప్పాలని నిలదీశారు.

కానీ తాము జగిత్యాలలో రామాలయం ఆక్రమణకు గురికాకుండా చూశామన్నారు. ధరూర్ క్యాంప్‌లో హనుమాన్ దేవాలయం విషయంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేతులెత్తేస్తే తాను ఆ ఆలయం కాపాడుతానని హామీ ఇచ్చానని తెలిపారు. ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు ముస్లింలు కావాలని ఎద్దేవా చేశారు. కానీ మన మతాన్ని ఎంతగా ప్రేమిస్తామో... ఇతర మతాలను కూడా అంతే గౌరవించాలన్నారు. దొరసాని పుణ్యాన పదేళ్లలో బొగ్గు గని కార్మిక సంఘం రద్దయిందని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సింగరేణి ఎన్నికల్లో తమ మిత్రపక్షం గెలిచిందని, ఇది రేపు లోక్ సభ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశమే అన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై స్పందిస్తూ... పథకాల అమలులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కవిత అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. తాము చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ ఎంపీగా ఆమె ఏమీ చేయలేదన్నారు.
Jeevan Reddy
Telangana
K Kavitha
Congress

More Telugu News