సీఎం జగన్ కు 20 ప్రశ్నాస్త్రాలు సంధించిన గంటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం జగన్ కు 20 ప్రశ్నాస్త్రాలు సంధించిన గంటా

Ganta Srinivasarao shot a letter to CM Jagan with 20 questions
  • ఏపీ సీఎం జగన్ కు గంటా బహిరంగ లేఖ
  • వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ప్రశ్నల వర్షం
  • ఏపీకి మీరు అవసరమా అంటూ నిలదీత
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు లేఖాస్త్రం సంధించారు. గడప గడపకు ప్రభుత్వం అన్నారు... కానీ ప్రతి గడపలోనూ అవమానమే అంటూ ఎద్దేవా చేశారు. అందుకే ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్నారని, కానీ ప్రజలు ఏపీ హేట్స్ జగన్ అనే బాణీ అందుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీకి మీరు అవసరమా? అంటూ గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ కు 20 ప్రశ్నాస్త్రాలు సంధించారు.

1) రైతు భరోసా: రూ.50 వేలు ఇస్తానని హామీ ఇచ్చి.. రూ.37,500కు కుదించారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలు రద్దు చేసి రూ. 2 లక్షలు నష్టం చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

2) అమ్మఒడి: అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తున్నారు. MTF, RTF స్కాలర్ షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను రద్దు చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

3) పెన్షన్లు: చంద్రన్న రూ.1800 పెంచగా, జగన్ రెడ్డి రూ.750 ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.3 వేల పెన్షన్ హామీపై మాట తప్పారు. ఏటా పెంపు హామీపై మడమ తిప్పినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

4) పేదలందరికీ ఇళ్లు: సెంటు పట్టా పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. భూమి కొనుగోలులో రూ. 7 వేల కోట్లు వైసీపీ నేతలు మింగేశారు. ఓటీఎస్ పేరుతో ఒక్కొక్కరి నుండి రూ.10 వేల నుండి రూ.40 వేల వరకు బలవంతంగా వసూల్ చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

5) ఫీజు రీయింబర్స్మెంట్: చంద్రన్న 16 లక్షల మందికి ఇచ్చారు. జగన్ రెడ్డి 7 లక్షల మందికి కోత కోసి 9 లక్షల మందికే ఇస్తున్నారు. చంద్రన్న ఒకే విడతలో ఇస్తే.. జగన్ రెడ్డి నాలుగు విడతలతో మోసం చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

6) మద్య నిషేధం: రూ. 2 లక్షల కోట్లకు పైగా మద్యం అమ్మి పేదలను కొల్లగొట్టారు. రూ. లక్ష కోట్లు కమీషన్లుగా దండుకున్నారు. మద్య నిషేధంపై మాట తప్పి మహిళల మాంగల్యాలను తెంచుతున్నందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

7) జలయజ్ఞం: కృష్ణా గోదావరి జలాలపై హక్కుల్ని కేంద్రానికి, తుంగభద్రపై హక్కుల్ని కర్ణాటకకు తాకట్టు పెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని దెబ్బతీసి నదుల అనుసంధానానికి గండికొట్టారు. రాష్ట్రాన్ని కరవు రక్కసికి బలిపెట్టారు. ఈ ఏడాది 34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయినందుకా చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

8) ఆరోగ్యశ్రీ: రూ. 1400 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేందుకు నెట్ వర్క్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. 104, 108 అంబులెన్సులు అక్కరకు రాని చుట్టాలైనందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

9) ఆసరా: ఆసరా కింద మొండి బకాయిలున్న 25% మందికే లబ్ది. 75% మందికి జగన్ రెడ్డి టోకరా వేశాడు. చంద్రన్న పాలనలో డ్వాక్రా రుణమాఫీ, పసుపుకుంకుమ ద్వారా ఒక్కో మహిళ రూ.20 వేల వరకు లబ్ది పొందారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి ఉంటే రూ. 1.80 లక్షల చొప్పున లబ్ది కలిగేది. హామీకి తిలోదకాలిచ్చి రూ.75వేలు అంటూ ఒక్కో మహిళకు రూ. 1.05 లక్షలు ఎగ్గొట్టినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

10) ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం దోపిడీ చేసి రూ.3.5 లక్షల కోట్లు కొల్లగొట్టి.. పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అంటున్న మీరు.. దేశంలోని ముఖ్యమంత్రులు అందరికంటే ధనవంతుడైనందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

11) ప్రశ్నించిన పౌరులు, మీడియా, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు, హత్యలు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ టెర్రరిస్టు పాలన చేస్తూ... ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

12) రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ ద్వారా చంద్రబాబు గారి పాలనలో ఒక్కో రైతు రూ.1,15,000 లబ్ది పొందగా, వీటిని రద్దు చేసి రైతు భరోసా పేరుతో రూ.37,500 ఇచ్చి దగా చేశారు. ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉందంటూ జాతీయ గణాంక సర్వేలో ఏపీని మొదటి స్థానంలో నిలిపినందుకా... రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని NCRP రిపోర్టులో తేలినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

13) ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఈ నాలుగేళ్ళ ఎనిమిది నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.8,25,549/- అదనపు భారం మోపినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...?

14) ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, నాలుగు రెట్లు ఇసుక రేట్లు పెంచి, భవన నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చి 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీశారు. 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని పోగొట్టినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

15) ప్రత్యేక హోదాను, విశాఖ రైల్వే జోన్ ను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసులు భయంతో కేంద్రం వద్ద తాకట్టు పెట్టినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

16) అన్న క్యాంటీన్లు, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, పండుగ కానుకలు లాంటి 120 పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదోడి పొట్ట కొట్టినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

17) ఎనిమిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, నాలుగుసార్లు ఆర్టీసి చార్జీలు పెంచారు, ప్రతి సంవత్సరం 15% ఆస్తి పన్ను పెంచుకుంటూ పోతూ పేదోడి నడ్డి విరిచినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

18) 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని మాట తప్పి యువతకు ఉద్యోగ కల్పన చేయకుండా, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్లు అని నమ్మించి.... ఆశతో ఎదురు చూపులు చూసి యువత విసిగి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళేలా చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

19) చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థల్ని వెంటాడి వేధించి రాష్ట్రం నుంచి తరిమేసి మీ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? 

20) తన దోపిడీని ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం తన నైజంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాను 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి... లేని కేసులో చంద్రబాబు గారిని జైల్లో పెట్టి పైశాచికానందం పొందినందుకా... వై ఏపీ నీడ్స్ జగన్...? అంటూ ప్రశ్నించారు.

"ఈ రాష్ట్రానికి మీరు వద్దని చెప్పడానికి ఇంకా సవాలక్ష కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు.... మీ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని, మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు...?" అంటూ గంటా ధ్వజమెత్తారు.
Advertisement
Ganta Srinivasa Rao
Jagan
Open Letter
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News