భారత్ గా మారనున్న ఇండియా?.. దుమారం రేపుతున్న రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక!

భారత్ గా మారనున్న ఇండియా?.. దుమారం రేపుతున్న రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక!

India replaced with Bharat in Presedent of India invitation letter to G20 leaders
  • 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్
  • జీ20 దేశాధినేతలకు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొన్న వైనం
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును 'ఇండియా' నుంచి 'భారత్'గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. 

మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో... ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. విపక్షాలు తమ కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమిపై బీజేపీ నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజపీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది.
Advertisement
India Vs Bharat
President Of India
President of Bharat
G20

More Telugu News