అందుకే నాకు సైట్ వచ్చింది: పవన్ కల్యాణ్
- మలికిపురంలో బహిరంగసభ
- వారాహి వాహనం నుంచి ప్రసంగించిన పవన్ కల్యాణ్
- వైసీపీ వాళ్ల వల్ల తన కళ్లకు ఛత్వారం పెరిగిపోయిందని చమత్కారం
- మార్పు రాజోలు నుంచే మొదలుపెడతామని స్పష్టీకరణ
ఉభయ గోదావరి జిల్లాల జనసేన నేతలు బాధ్యతగా వ్యవహరించాలని, స్థానిక వైసీపీ నేతలకు జనసేన నేతలు భయపడ్డా, వారికి సరైన సమాధానం ఇవ్వలేకపోయినా తాను వచ్చి సమాధానం ఇస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాలను అంటిపెట్టుకుని ప్రవహిస్తూ అంతర్వేదిలో కలుస్తుందని, ఈ పవన్ కల్యాణ్ కూడా ఈ నేలను అలాగే అంటిపెట్టుకుని ఉంటాడని పునరుద్ఘాటించారు.
తెలంగాణ, ఆంధ్రా విడిపోయినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పచ్చదనాన్ని, కోనసీమ పచ్చదనాన్ని తెగ తిట్టిపోశారని పవన్ వెల్లడించారు. మీకు పచ్చదనం ఉంది, మా ప్రాంతాల్లో పచ్చదనం లేదని అన్నారని తెలిపారు.
ఇకపై తాను ఇక్కడే ఉంటానని, ప్రతి మండల సమస్యలు తెలుసుకుంటానని, పరిష్కార మార్గాలు రూపొందిస్తానని స్పష్టం చేశారు. జనసేనకు అండగా నిలిచిన రాజోలు నుంచే మార్పును మొదలుపెడదాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.