Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐర్లాండ్ పై శ్రీలంక పరుగుల సునామీ... అరుదైన రికార్డు

Sri Lanka run feast against minnows Ireland
Advertisement
  • శ్రీలంక-ఐర్లాండ్ రెండో టెస్టు
  • ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 492 ఆలౌట్
  • 3 వికెట్లకు 704 పరుగుల స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన లంక
  • మధుష్క, కుశాల్ మెండిస్ డబుల్ సెంచరీలు
  • కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ శతకాలు
  • లంకకు 212 పరుగుల ఆధిక్యం
Advertisement
ఐర్లాండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ సునామీ సృష్టించింది. గాలేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌట్ అయింది. అందుకు బదులుగా శ్రీలంక విశ్వరూపం ప్రదర్శించింది. 

తన తొలి ఇన్నింగ్స్ ను 3 వికెట్లకు 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లంకేయులు కేవలం 151 ఓవర్లలోనే ఈ స్కోరు కొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో ఇద్దరు డబుల్ సెంచరీ బాదగా, మరో ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు.

ఓపెనర్ నిషాన్ మధుష్క 205, వన్ డౌన్ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ 245 పరుగులు చేశారు. మరో ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే 115 పరుగులు చేయగా, సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ 100 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. 

పెద్దగా టెస్టు మ్యాచ్ అనుభవంలేని ఐర్లాండ్ ఆటగాళ్లు... ఓవైపు లంక ఆటగాళ్ల విజృంభణ, మరో వైపు విపరీతమైన వేడిమి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పసలేని ఐర్లాండ్ బౌలింగ్ ను లంక బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా, కుశాల్ మెండిస్ ఒక్కడే 18 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు. నిషాన్ మధుష్క 22 ఫోర్లు, 1 సిక్స్.. కరుణరత్నే 15 ఫోర్లు... ఏంజెలో మాథ్యూస్ 6 ఫోర్లు, 4 సిక్సులతో హడలెత్తించారు. 

కాగా, ఓ టెస్టులో టాప్-4 బ్యాట్స్ మన్ సెంచరీలు బాదడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. 2007లో ఈ రికార్డును టీమిండియా నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో ఆడుతూ దినేశ్ కార్తీక్, వసీమ్ జాఫర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 2019లో ఇదే ఘనతను పాకిస్థాన్ సాధించింది. శ్రీలంకపై ఆడుతూ పాక్ బ్యాటర్లు షాన్ మసూద్, అబిద్ అలీ, అజహర్ అలీ, బాబర్ అజాబ్ సెంచరీలు నమోదు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీలంక కూడా చేరింది.

ఇక, 212 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఇంకా 174 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 8 వికెట్లున్నాయి. రేపు ఆటకు చివరి రోజు కాగా, లంక స్పిన్నర్లను తట్టుకుని ఐర్లాండ్ బ్యాటర్లు నిలిచేది సందేహమే. కాగా, ఈ రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును శ్రీలంక నెగ్గింది.
Advertisement
Advertisement
Sri Lanka
Ireland
2nd Test
Galle

More Telugu News