17 ఏళ్లకే ధోనీ కంట్లో పడ్డ బౌలర్.. ఇప్పుడు సీఎస్కే తురుపుముక్క
- సీఎస్కేలో కీలక బౌలర్ గా మారిన మతీష పతిరణ
- బెంగళూరుపై విజయంలో కీలక పాత్ర
- 2020లోనే పతిరణను సంప్రదించిన ధోనీ
అతడే మతీష పతిరణ. ఇప్పుడు అతడి వయసు 20 ఏళ్లు. ఇటీవలే ఆర్సీబీ తో మ్యాచ్ లో ఈ బౌలర్ ఎంతో అద్భుతంగా బౌల్ చేశాడు. ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందాడు. అంత చిన్న వయసులో డెత్ ఓవర్ లో బౌలింగ్ తో, ఒక వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం వెనుక ధోనీ మార్గదర్శకం ఉందని చెప్పుకోవాలి. ధోనీ 2020లో మొదటిసారి పతిరణను సంప్రదించిన విషయం బయటపడింది.
అప్పుడు పతిరణ వయసు 17 ఏళ్లు. కరోనా మహమ్మారి కారణంగా 2020 ఐపీఎల్ వేదికను యూఏఈకి మార్చారు. 2020లో శ్రీలంక తరఫున అండర్ 19 ప్రపంచకప్ లోనూ పతిరణ పాల్గొన్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన ధోనీ లేఖ రాశాడు. యూఏఈ వచ్చి సీఎస్కేలో భాగం కావాలని కోరాడు. శ్రీలంక మాజీ దిగ్గజ బౌలర్ మలింగ వద్ద పతిరణ శిక్షణ తీసుకోవడం గమనార్హం. పతిరణ వేగం, కచ్చితత్వం మలింగను ఆకట్టుకుంది.