డబ్ల్యూపీఎల్: కొట్టేస్తారనుకుంటే చతికిలపడ్డారు!
- స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్
- అద్భుతంగా ఆడిన గుజరాత్ జెయింట్స్
- 11 పరుగుల తేడాతో ఢిల్లీపై జయభేరి
- టోర్నీలో రెండో విజయం నమోదు
ఈ మ్యాచ్ లో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. తొలుత గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది.
గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 2, తనూజా కన్వర్ 2, ఆష్లే గార్డనర్ 2, కెప్టెన్ స్నేహ్ రాణా 1, హర్లీన్ డియోల్ 1 వికెట్ తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో మరిజేన్ కాప్ 36, అరుంధతి రెడ్డి 25, అలిస్ కాప్సే 22 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో ఆఖర్లో కొద్దిగా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ బ్యాటర్ అరుంధతి రెడ్డి పోరాడడంతో ఆ జట్టు లక్ష్యాన్ని అందుకునేలా కనిపించింది. అయితే, అరుంధతిని కిమ్ గార్త్ అవుట్ చేయడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మొగ్గింది. పూనమ్ యాదవ్ ను గార్డనర్ అవుట్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్ ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది.