ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ సూపర్ విక్టరీ

UP Warriarz beats Gujarat Giants by three wickets
  • డబ్ల్యూపీఎల్ లో యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్
  • 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన యూపీ
  • అద్భుతంగా ఆడిన గ్రేస్ హారిస్
  • రాణించిన కిరణ్ నవ్ గిరే, సోఫీ ఎకెల్ స్టోన్
డబ్ల్యూపీఎల్ లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. గుజరాత్ జెయింట్స్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

చివర్లో రెండు బంతుల్లో ఒక పరుగు చేయాల్సి ఉండగా, గ్రేస్ హారిస్ లెగ్ సైడ్ అద్భుతమైన సిక్స్ కొట్టింది. 26 బంతులాడిన గ్రేస్ హారిస్ 59 పరుగులతో యూపీ వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమె స్కోరులో 7 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. సోఫీ ఎకెల్ స్టోన్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. అంతకుముందు, కిరణ్ నవ్ గిరే 53 పరుగులు చేసి ఎంతో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడింది. 

గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు తీయడం విశేషం. అనాబెల్ సదర్లాండ్ 1, మానసి జోషి 1 వికెట్ తీశారు. 

కాగా, గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ జట్టు ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
UP Warriarz
Gujarat Giants
WPL

More Telugu News