బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!
- స్క్రాప్ కింద అమ్మేసి సొమ్ముచేసుకున్న దొంగల ముఠా
- మోసానికి సహకరించిన ఆర్ పీఎఫ్ సిబ్బందిపై వేటు
- విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది. అయితే, ఈ మిల్ మూతపడడంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు కూడా ఆ ట్రాక్ ను పట్టించుకోవడం లేదు.
ఇలా నిరుపయోగంగా మారిన ట్రాక్ ను రైల్వే శాఖ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, స్క్రాప్ కింద అమ్మేయాలి. కానీ ఈ ట్రాక్ విషయంలో అలాంటివేవీ జరగలేదు. ట్రాక్ మాత్రం మాయమైంది. ప్రాథమిక విచారణలో కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి, ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను అమ్మేసి సొమ్ము చేసుకున్నారని తేలింది. ట్రాక్ చోరీకి గురైందన్న సమాచారం తెలిసి రైల్వే ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. బాధ్యులలో ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేశారు.