స్టేషన్ లో కూర్చొని వచ్చిపోయే రైళ్లను లెక్కించాలి.. రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం!
- 28 మంది నిరుద్యోగుల నుంచి రూ.2.67 కోట్లు కాజేసిన కేటుగాడు
- నెల రోజులు రైల్వే స్టేషన్ లో శిక్షణ పేరుతో నాటకం
- నియామక పత్రాలతో రైల్వే అధికారుల వద్దకు వెళ్లగా నాటకం బట్టబయలు
తమిళనాడుకు చెందిన సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్ లో ఇటీవల ఆయనకు కోయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కేంద్ర ప్రభుత్వంలో తనకు పెద్ద పెద్దోళ్లతో పరిచయాలున్నాయని శివరామన్ చెప్పాడు. ఆ పరిచయాలతో అవసరమైన వాళ్లకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని సుబ్బుసామిని నమ్మించాడు. దీంతో సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను తీసుకువచ్చాడు. విషయం తెలిసి మధురై నుంచి మరో 25 మంది యువకులు వచ్చారు.
శివరామన్ వీళ్లందరినీ వికాస్ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఉత్తర రైల్వే ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ నని వికాస్ రాణా వారికి చెప్పాడు. టీటీఈ, ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 28 మంది యువకులు ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు వసూలు చేశాడు. ఆపై వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, ఫోర్జరీ పత్రాలతో వికాస్ రాణా ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు.
వాళ్లందరికీ ఐడీ కార్డులు ఇచ్చి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్ లో శిక్షణ కూడా ఇప్పించాడు. రోజూ ఎనిమిది గంటల పాటు ఆ స్టేషన్ లో కూర్చోవడం, స్టేషన్ కు వచ్చిపోయే రైళ్లను, వాటికున్న బోగీలను లెక్కించడమే శిక్షణ అని చెప్పాడు. నెల రోజుల పాటు ఈ శిక్షణ పూర్తయ్యాక వికాస్ రాణా వారికి నియామక పత్రాలు ఇచ్చాడు. వాటిని తీసుకొని రైల్వే అధికారుల దగ్గరకు వెళ్లగా.. అవి ఫోర్జరీ చేసినవని తేలింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న యువకులు, సుబ్బుసామి పోలీసులను ఆశ్రయించారు.