ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మల్లారెడ్డి
- నాతో సంతకం చేయించుకుంటామని చెప్పి.. నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారన్న మల్లారెడ్డి
- పేపర్లో ఏముందో కూడా చూడకుండా నా కొడుకు సంతకం పెట్టాడని వెల్లడి
- నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడనే విషయాన్ని కూడా టీవీలో చూసే తెలుసుకున్నామన్న మంత్రి
ఆసుపత్రికి వెళ్లిన ఐటీ అధికారులు అంతా అయిపోయిందని, సంతకం చేయాలని తన కొడుకుపై ఒత్తిడి చేశారని మల్లారెడ్డి తెలిపారు. తన కొడుకు ఆ పేపర్లో ఏముందో కూడా చదవకుండా సంతకం పెట్టేశాడని అన్నారు. ఇంత మోసం చేయాల్సిన అవసరం ఐటీ అధికారులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
తన కొడుకు ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరాడనే విషయాన్ని కూడా తాము టీవీలో చూసే తెలుసుకున్నామని మల్లారెడ్డి చెప్పారు. ఈ విషయం తెలిసి తన భార్య ఏడ్చేసిందని... తాము ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఐటీ అధికారులు అనుమతించలేదని... ఫోన్ ద్వారా మాట్లాడిస్తామని చెప్పారని తెలిపారు. కానీ, తామే బలవంతంగా ఆసుపత్రికి వచ్చామని చెప్పారు.