నేను ఇంకా చావలేదు: సమంత కంటతడి
- మయోసైటిస్ పై తాను పోరాటం చేస్తానన్న సమంత
- తాను ఇప్పుడు కఠిన పరిస్థితిలోనే ఉన్నానని వ్యాఖ్య
- ఒక్కొక్క సారి ఒక్క అడుగు కూడా వేయలేనేమో అని అనిపిస్తుందని ఆవేదన
ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సమంత చెప్పారు. తాను కూడా దీన్ని ఎదుర్కొంటానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టుకున్నారు. త్వరలోనే దీన్నుంచి బయటపడతానని అన్నారు. 'నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కొందరు వార్తలు రాశారు. అది నిజం కాదు. ప్రస్తుతం నేను ఆ పరిస్థితిలో లేను. ప్రస్తుతానికైతే నేను ఇంకా చావలేదు' అన్నారు సమంత.
మన నియంత్రణలో ఏదీ ఉండదని... అంతా మన లైఫ్ డిసైడ్ చేస్తుందని చెప్పారు. తాను ఇప్పుడు కఠిన పరిస్థితిలోనే ఉన్నానని చెప్పారు. అందరి జీవితాల్లో మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయని తెలిపారు. ఒక్కొక్క సారి ఒక్క అడుగు కూడా వేయలేనేమో అని అనిపిస్తుందని అన్నారు. అయితే, తాను పోరాటం చేస్తానని, గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.