నెహ్రూ తప్పిదాలకు దేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- భారత్ లో కశ్మీర్ విలీనం ఆలస్యం చేసింది నెహ్రూనే అని వ్యాఖ్య
- అప్పటి కశ్మీర్ మహారాజు ఒప్పుకోలేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్
- అది చారిత్రక అబద్ధం అని కిరణ్ రిజిజు కౌంటర్
‘కశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడంపై మహారాజా హరిసింగ్ విలవిలలాడారు. కశ్మీర్ కు స్వాతంత్ర్యం (ప్రత్యేక దేశంగా) గురించి ఆయన కలలు కన్నారు. కానీ పాకిస్థాన్ దాడి చేశాక హరిసింగ్ భారతదేశంలో చేరేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత షేక్ అబ్దుల్లా పూర్తి విలీనాన్ని సమర్థించారు. జునాగఢ్ నవాబ్ పాకిస్థాన్ లో చేరిన సెప్టెంబరు 13, 1947 వరకు జమ్మూకశ్మీర్ పాకిస్థాన్ లో చేరడానికి సర్దార్ పటేల్ అంగీకరించారు’ అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన రిజిజు.. ఇది చారిత్రక అబద్ధం అని అన్నారు. ‘స్వాతంత్య్రానికి నెల రోజుల ముందు జులై 1947లోనే తొలిసారిగా మహారాజా హరిసింగ్ నెహ్రూను సంప్రదించారు. కానీ, మహారాజు ప్రతిపాదనకు నెహ్రూ ఒప్పుకోలేదు. ఇతర సంస్థానాలను విలీనం చేసుకునేందుకు ఒప్పుకొని... హరిసింగ్ అభ్యర్థనను నెహ్రూ తిరస్కరించారు. 1947 అక్టోబర్‌లో కూడా నెహ్రూ ఈ అభ్యర్థనకు ఒప్పుకోలేదు. ఈ సమయంలోనే పాకిస్థానీ ఆక్రమణదారులు శ్రీనగర్‌కి కిలోమీటర్ల పరిధిలోకి చేరుకున్నారు. కశ్మీర్ కోసం నెహ్రూ కొన్ని 'ప్రత్యేక' కేసులను రూపొందించారు. భారత్ లో విలీనం కంటే 'చాలా ఎక్కువ' కోరుకున్నారు. ఆ ప్రత్యేక కేసు ఏమిటి? ఓటు బ్యాంకు రాజకీయాలే కదా?. నెహ్రూ చేసిన తప్పిదాలకు భారతదేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది’ అని రిజిజు ట్వీట్ చేశారు.