మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం

Teachers talks with minister Botsa failed
  • ఫేస్ రికాగ్నిషన్ యాప్ ను తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వం
  • ఉపాధ్యాయుల్లో యాప్ పట్ల అసంతృప్తి
  • యాప్ పై టీచర్లకు శిక్షణ నిస్తామన్న బొత్స
  • సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేయలేమన్న టీచర్లు
ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఫేస్ రికాగ్నిషన్ యాప్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ యాప్ డౌన్ లోడ్ చేయడం ఒక ప్రహసనమైతే, దాంట్లో లాగిన్ కావడం, నిత్యం ఫొటోలు అప్ లోడ్ చేయడం మరో ప్రహసనం అని పలువురు టీచర్లు వాపోతున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలు జరపగా, ఆ చర్చలు విఫలం అయ్యాయి. 

చర్చల సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, ఫేస్ రికాగ్నిషన్ యాప్ పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అన్నారు. 15 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి యాప్ అమల్లోకి తెస్తామని చెప్పారు. ఈ నెలాఖరులోపు టీచర్లకు శిక్షణ షురూ చేయాలని అధికారులను ఆదేశించారు. యాప్ లో ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకున్నారని, మిగతా 50 శాతం మంది త్వరలోనే రిజిస్టర్ చేసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. 

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బొత్స పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో ముందుకుపోతున్నామని, ఉపాధ్యాయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్ముందు మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావొచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. సెల్ ఫోన్లు ఉద్యోగులవా, లేక ప్రభుత్వమే ఇస్తుందా? అనేది ఆయా శాఖల నిర్ణయం అని వివరించారు. 

అటు, ఉపాధ్యాయులు స్పందిస్తూ, సొంత ఫోన్లలో ఫేస్ రికాగ్నిషన్ యాప్ కు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
Botsa Satyanarayana
Teachers
Face Recognition App
AP Govt
YSRCP

More Telugu News