జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ పరిశీలనలో ఉంది: కేంద్ర ప్రభుత్వం
- జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక
- నివేదిక ఆధారంగా లా కమిషన్ అధ్యయనం
- ఓ ప్రణాళికను రూపొందించే పనిలో లా కమిషన్
- బీజేపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానం
జమిలి ఎన్నికల నిర్వహణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపినట్లు ఆ సమాధానంలో రిజిజు తెలిపారు. ఈ అంశంపై భాగస్వామ్య పక్షాలతోనూ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమర్పించిన ఓ నివేదికలో కొన్ని ప్రతిపాదనలతో పాటు సిఫారసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ నివేదికను ఆధారం చేసుకుని లా కమిషన్ ప్రస్తుతం అధ్యయనం చేస్తోందని తెలిపారు. జమిలి ఎన్నికలకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించే పనిలో లా కమిషన్ ఉందని ఆయన వెల్లడించారు.
వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల భారీగా ప్రజా ధనం ఖర్చు అవుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొందని రిజిజు తెలిపారు. 2014-22 మధ్య కాలంలోనే 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని చెప్పిన ఆయన.. అందుకు గాను రూ.7 వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిందని చెప్పారు. ఈ తరహాలో ప్రజాధనం వృథా ఖర్చును నివారించేందుకే జమిలి ఎన్నికలను ప్రతిపాదించినట్లు రిజిజు పేర్కొన్నారు.