తెలంగాణ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం.. విపక్ష నేతపై సీఎం ప్రశంసలు
- మన ఊరు- మన బడిపై భట్టి సానుకూల వ్యాఖ్యలు
- అవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భట్టికి కేసీఆర్ ప్రశంసలు
- భట్టికి విషయ పరిజ్ఞానం ఎక్కువని కితాబు
- భట్టిని పార్లమెంటుకు పంపాలని సూచన
ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రసంగించిన సందర్భంగా భట్టి మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమంపై సానుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘భట్టి గారు మన ఊరు మన బడి మంచిది అని చెప్పారు. భట్టి గారు ఈ సారి ఓ మంచి మాట చెప్పారు. భట్టి గారికి ప్రమోషన్ ఇవ్వాలి. పార్లమెంట్ కి పంపాలి’ అని కేసీఆర్ అన్నారు.
జాతీయ స్థాయి అంశాలపై భట్టి కాస్తంత గట్టిగానే కాకుండా అవగాహనతో మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పార్లమెంట్‌కు పంపాలని తాను అంటున్నానని కేసీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. విపక్ష నేతపై కేసీఆర్ ప్రశంసలు కురిపించడంతో సభలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది.