రష్యాతో చర్చలకు మేం సిద్ధం... అయితే బెలారస్ లో కాదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
- ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
- చర్చలకు రావాలంటూ ఉక్రెయిన్ కు రష్యా పిలుపు
- బెలారస్ వేదికగా చర్చలకు ఆహ్వానం
- దాడులు బెలారస్ నుంచే జరుగుతున్నాయన్న జెలెన్ స్కీ
ప్రస్తుతం రష్యా దురాక్రమణకు బెలారస్ ఎంతో సహకరిస్తోందని, అలాంటి చోట తాము చర్చలు జరపబోమని జెలెన్ స్కీ పేర్కొన్నారు. వార్సా, బ్రటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకు... ఈ ప్రాంతాల్లో ఎక్కడ చర్చలు జరిపినా తమకు సమ్మతమేనని వివరించారు. ఉక్రెయిన్ కు వ్యతిరేకం కాని దేశాల్లోనే తాము చర్చలు జరుపుతామని ఉద్ఘాటించారు.
రష్యా దాడులు అత్యంత కిరాతకమని, సాధారణ పౌరుల ఆవాసాలను సైతం ధ్వంసం చేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ప్రకటించిన రష్యా అందుకు విరుద్ధంగా పౌర సముదాయాలపై బాంబుల వర్షం కురిపిస్తోందన్నారు.