రేవంత్ రెడ్డి ఒక థర్డ్ రేట్ క్రిమినల్: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
- తెలంగాణ కృషిని శశిథరూర్ మెచ్చుకున్నారు
- ఆయనను రేవంత్ గాడిద అని అన్నారు
- థర్డ్ రేట్ క్రిమినల్ పార్టీని నడిపిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది
కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఇటీవలే హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. మరోవైపు, ఆయన హైదరాబాదుకు వస్తున్నట్టుగా రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ అంశాన్ని రేవంత్ ముందు ప్రస్తావించగా ఆయన మండిపడినట్టు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కథనం వచ్చింది.
శశిథరూర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా మనుషులని రేవంత్ అన్నారని సదరు పత్రిక పేర్కొంది. ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులుగా భావించాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్టు తెలిపింది. శశిథరూర్ ఒక గాడిద అని... కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బహిష్కరిస్తుందని భావిస్తున్నానని రేవంత్ చెప్పినట్టు పేర్కొంది. దీనిపై స్పందిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.