కేజ్రీవాల్ కు ఇక కష్టకాలమే... చట్టంగా మారిన ఢిల్లీ బిల్లు!
- బుధవారం నాడు రాజ్యసభలో ఆమోదం
- బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి
- ఎప్పటి నుంచి అమలన్న విషయం హోమ్ శాఖ పరిధిలోకి
ఈ చట్టం అమలులోకి వస్తే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మరిన్ని కష్టాలు ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి, ఎల్జీకి మధ్య అధికార యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం, ఢిల్లీలో ప్రభుత్వం అంటే, లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే. ఏ కార్య నిర్వాహక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయమే కీలకం అవుతుంది.
ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందని పలువురు విపక్ష పార్టీలు రెండు రోజుల పాటు రాజ్యసభలో తమ నిరసనలను తెలియజేసినా, ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేసినా, కేంద్రం రాజ్యసభలో తమకున్న బలంతో మూజువాణీ ఓటుతో ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ఢిల్లీని పాలించాలన్న దుర్మార్గపు ఉద్దేశంతో ఎల్జీని అడ్డుపెట్టుకుందని ఆప్ ప్రభుత్వం తరచూ విమర్శలు గుప్పిస్తోంది.