Telangana: 7 రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి... మరో రెండు రోజులు వర్షాలు!

Two Days Rain Warning for 7 States
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలపై వ్యాపించడంతో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఇదే సమయంలో తూర్పు గాలుల కారణంగా బంగాళాఖాతంపై మరో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

ఈ ద్రోణి ప్రస్తుతం తమిళనాడు తీరం నుంచి ఒడిశా తీరం వరకూ వ్యాపించిందని, రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా, నిన్న ఆకాశం పూర్తి మేఘావృతమై కనిపించగా, కొన్ని చోట్ల వర్షం పడింది. ఈ అకాల వర్షాలతో చేతికందిన పంట నోటికందే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే నాలుగు నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. పగటి పూట కాసేపు ఎండగా అనిపించినా, రాత్రి వచ్చేసరికి తీవ్రమైన చలి వాతావరణం కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ నగరంలో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, మరో మూడు రోజులు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని, ఆపై క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Go Back to Shorts
Telangana
Andhra Pradesh
Rain
IMD
Cold Wave
Heat

More Telugu News