60 దేశాలను చుట్టేసిన బ్రిటన్​ కరోనా: డబ్ల్యూహెచ్​ వో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

60 దేశాలను చుట్టేసిన బ్రిటన్​ కరోనా: డబ్ల్యూహెచ్​ వో

UK coronavirus strain detected in at least 60 countries
  • 23 దేశాలకు విస్తరించిన దక్షిణాఫ్రికా రకం
  • వారంలో 47 లక్షల కేసులు.. 93 వేల మరణాలు
  • 6% తగ్గిన కేసులు.. 9% పెరిగిన మృతులు
బ్రిటన్ కరోనా.. ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న స్ట్రెయిన్ ఇది. మన దేశానికీ అది విస్తరించింది. భారత్, అమెరికాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా చుట్టేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కొవిడ్ పై బుధవారం విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. గత వారంలోనే 10 దేశాలకు అది వ్యాపించిందని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. దక్షిణాఫ్రికా రకం కరోనా 23 దేశాలకు పాకిందని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే, మరణాలు మాత్రం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారని, అంతకుముందు వారంతో పోలిస్తే అది 9 శాతం అధికమని పేర్కొంది. మొత్తంగా ప్రపంచమంతటా 9.3 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 20 లక్షల మందికి పైగా మరణించారని పేర్కొంది.

స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. సామూహిక వ్యాప్తి ఉన్న చోట కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని, అలాంటి చోట విద్యార్థులు, సిబ్బందికి మహమ్మారి సోకకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై చర్చించాలని చెప్పింది.
COVID19
WHO

More Telugu News