Krishna District: మచిలీపట్నంలో ఘోరం.. ప్రియురాలి అన్నను హతమార్చిన ప్రియుడు!

మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రియురాలిని తనతో మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నాడన్న కారణంతో ఆమె అన్నను దారుణంగా హతమార్చాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అమృతపురం జెండా సెంటర్‌కు చెందిన యర్రంశెట్టి సాయి (21) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ యాసిన్ ఇద్దరూ స్నేహితులు. సాయి కోసం యాసిన్ ప్రతి రోజూ అతడి ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో సాయి సోదరితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

విషయం తెలిసిన సాయి.. తన చెల్లెలితో తిరగవద్దంటూ యాసిన్‌ను హెచ్చరించాడు. అతడి మాటలను యాసిన్ వినిపించుకోకపోవడంతో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ప్రియురాలిని కలిసేందుకు సాయి అడ్డువస్తుండడంతో పగతో రగిలిపోయిన సయ్యద్ అతడిని  హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పార్టీ పేరుతో నిన్న ఆంధ్ర జాతీయ కళాశాల వెనకవైపు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి సాయిని పిలిపించాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో ముందుగా తెచ్చుకున్న సైనెడ్‌ను సాయి తాగే మద్యంలో కలిపాడు. విషయం తెలియని సాయి మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఆ వెంటనే యాసిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Krishna District
Machilipatnam
love
Murder

More Telugu News