మరోసారి వార్తల్లోకి పరప్పన అగ్రహార జైలు... వైరల్ అవుతున్న ఖైదీల టిక్ టాక్!

  • ప్రియురాళ్ల ఫొటోలతో ఇద్దరు ఖైదీల టిక్ టాక్
  • జైల్లోకి సెల్ ఫోన్లు, సిగరెట్లు
  • విచారణ ప్రారంభించిన అధికారులు
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే ఇక్కడి ఖైదీలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారని, కొందరు బయటకు వెళ్లి షాపింగ్ కూడా చేస్తుంటారని నివేదికలు స్పష్టం చేయగా, తాజాగా, కొందరు ఖైదీలు చేసిన టిక్ టాక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పలు నేరాలకు పాల్పడిన ఇద్దరు, జైలు శిక్షను అనుభవిస్తూ, టిక్ టాక్ చేశారు. వీరు తమ ప్రియురాళ్ల చిత్రాలతో ఈ వీడియోలు తయారు చేశారు.

గతంలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో గాయపడి, ఆపై జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వసీమ్, ఫయాజ్ లు ఈ వీడియోలు చేశారు. ఇందులో వారు సిగరెట్లు తాగుతూ కూడా కనిపించారు. చాకు, కడ్డీ వంటివి ప్రదర్శించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో జైలులోకి సెల్ ఫోన్లు, సిగరెట్లు ఎలా వెళ్లాయన్న విషయమై అధికారులు విచారణ ప్రారంభించారు.

కాగా, ఇదే జైలులో జయలలిత అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆమె జైలు గదులు సకల సౌకర్యాలతో ఉన్నాయని, ఆమె బయటకు వెళ్లి షాపింగ్ చేసి వస్తున్నారని కొన్ని వీడియోలు, ఫొటోలు బయటకు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. 
Go Back to Shorts
Bengalore
Parappana
Jail
Tiktok

More Telugu News