మిమ్మల్ని జనాలు పిచ్చి తుగ్లక్ అనుకుంటున్నారే తప్ప హీరో అనుకోవడం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

టీడీపీ పెట్టిన బాధలను తట్టుకోలేక గత ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రజలు మౌనంగా ఎలా కసి చూపించారో... 2024 ఎన్నికల్లో వైసీపీపై అదే కసిని చూపిస్తారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధానిగా అమరావతిని మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న కారణాలకు, చేతలకు పొంతన లేదని చెప్పారు. అమరావతిని కొంత కాలం ఎడారి అన్నారని, కొంత కాలం మునిగి పోతుందని అన్నారని, కొంత కాలం అడవి అన్నారని... ఇప్పుడు సరికొత్తగా లక్ష కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలంటున్నారని విమర్శించారు. ఆ లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనే కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతులకు, రైతు కూలీలకు మీరు ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీ ఖర్చుతో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని కన్నా చెప్పారు. ఈ నేపథ్యంలో మీకు ఖర్చు ఒక్కటే కారణమని తాను భావించడం లేదని అన్నారు. అమరావతిలో మరో భూదందాకు మీరు తెరలేపబోతున్నారనే కారణమే తనకు కనిపిస్తోందని చెప్పారు. అమరావతిపై మీరు చెబుతున్న కారణాలు, కబుర్లు నమ్మదగినవి కాదని అన్నారు. అసెంబ్లీని ఇక్కడ ఉంచి సెక్రటేరియట్ ను విశాఖలో పెడతామని చెప్పడం పిచ్చి తుగ్లక్ ను మరిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు మిమ్మల్ని పిచ్చి తుగ్లక్ అనుకుంటున్నారే తప్ప... మిమ్మల్ని హీరో అనుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై జనసేనతో కలిసి పోరాడుతామని... ఇరు పార్టీలు కలిసి కార్యాచరణను రూపొందిస్తాయని చెప్పారు.
Go Back to Shorts
Kanna Lakshminarayana
Jagan
Amaravati
YSRCP
BJP

More Telugu News