ఈసారి వర్షాలు తక్కువే: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ తొలి అంచనా

IMD Forecasts Below Normal Rainfall for Southwest Monsoon 2024
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్న 2026 నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (IMD) తన తొలి విడత అంచనాలను సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, దీర్ఘకాలిక సగటు (LPA)లో సుమారు 90 నుంచి 95 శాతం మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సగటున 92 శాతం వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ఇందులో 5 శాతం అటూఇటూగా ఉండవచ్చని పేర్కొంది.

1971 నుంచి 2020 మధ్య కాలంలోని వర్షపాత డేటా ఆధారంగా, దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీ.గా ఉంది. దీని ఆధారంగానే ఐఎండీ తన అంచనాలను వెల్లడిస్తుంది. కాగా, రుతుపవనాల కదలికలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను మరింతగా విశ్లేషించి, మే చివరి వారంలో సవరించిన అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ తెలిపింది.

రుతుపవనాలపై ప్రభావం చూపే కీలక అంశాల గురించి కూడా ఐఎండీ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీనంగా ఉన్న లా నినా పరిస్థితులు ముగిసి, ఎల్‌ నినో-సదరన్ ఆసిలేషన్ (ENSO) తటస్థ స్థితికి మారుతున్నాయని తెలిపింది. అయితే, 'మాన్‌సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (MMCFS)' మోడల్ ప్రకారం, నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సాధారణంగా ఎల్ నినో ఏర్పడినప్పుడు ఆసియా దేశాలలో వర్షాలు తగ్గి, కరవు పరిస్థితులు తలెత్తుతాయి.

మరోవైపు హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవనాల చివరి దశలో ఇది సానుకూలంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. పసిఫిక్, హిందూ మహాసముద్రాలలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారత రుతుపవనాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి, ఈ రెండు సముద్రాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఐఎండీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Go Back to Shorts
IMD
India Meteorological Department
Southwest Monsoon
Rainfall Forecast
El Nino
La Nina
Indian Ocean Dipole
Weather Forecast
Monsoon 2024

More Telugu News