ప్రేమ వల విసిరాడు...రూ.15 లక్షలు నొక్కేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ వల విసిరాడు...రూ.15 లక్షలు నొక్కేశాడు!

  • హైదరాబాద్ లో ఉంటున్న సౌదీ ఇంజనీరింగ్ విద్యార్థి చీటింగ్ 
  • ఎయిర్‌లైన్స్ ఉద్యోగినితో ప్రేమ పాఠాలు 
  • దఫదఫాలుగా డబ్బు నొక్కేసిన వైనం

అందమైన మాటలతో ఆమెకు ప్రేమ వల విసిరాడు. ఢిల్లీలో పుట్టి పెరిగి, సౌదీ ఎయిర్‌లైన్స్ లో పనిచేస్తున్న ఆమె స్థాయిని చూసి డబ్బు గుంజేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. పెళ్లి పేరుతో పలు సందర్భాల్లో ఆమె నుంచి భారీగా డబ్బు గుంజేశాడు. అనంతరం ముఖం చాటేయడంతో కుర్రాడి అసలు రూపం ఆమెకు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని జైలుకు పంపారు.  

వివరాల్లోకి వెళితే, సౌదీ అరేబియాలోని ఆల్ రియల్ ప్రాంతానికి చెందిన అలీ ఆల్ ఖఫీ సలీం అలీ (30) హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. షేక్ పేట పారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. ఢిల్లీలో పుట్టి పెరిగి, సౌదీ ఎయిర్‌లైన్లో పనిచేస్తున్న యువతి (32)తో ఇతనికి 2015లో పరిచయం అయ్యింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆ యువతిని అలీ తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఇద్దరి మధ్య బాంధవ్యం పెరగడంతో ఆమెకు అలీ పట్ల నమ్మకం కుదిరింది. ఇది గుర్తించిన అలీ తన అసలు రూపాన్ని బయట పెట్టడం మొదలు పెట్టాడు. అత్యవసరాల పేరుతో పలు దఫాలుగా ఆమె నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నాడు.

డబ్బు గుంజేశాక ముఖం చాటేసి, ఆమెకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో అలీ ఈ నెల 6న రియాద్ నుంచి హైదరాబాద్ విమానంలో వస్తుండగా ఆమె కంటపడ్డాడు. దీంతో ఆమె అతనిని నిలదీసింది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తీసుకున్న డబ్బులు కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పేశాడు.

పైగా బెదిరింపులకు కూడా దిగడంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

Cheating
soudu arabia
Hyderabad
lover

More Telugu News