వెనిజులా పాలకుడు మదురోకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్!
- మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రకటన
- అధికారం నుంచి తప్పుకోవాలని సూచన
- ఆర్థిక ఆంక్షలతో అల్లాడిపోతున్న వెనిజులా ప్రజలు
దేశంలో బతకలేక 40 లక్షల మంది ప్రజలు పొరుగుదేశాలకు కట్టుబట్టలతో వలస వెళ్లారు. అయినా మదురో అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధం కాలేదు. మరోవైపు వలసదారుల విషయంలో వెనిజులా-కొలంబియా దేశాల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో వెనిజులా ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా, తమ సైన్యం కొలంబియాకు మద్దతు ఇస్తుందని అమెరికా హామీ ఇచ్చింది.
దక్షిణ అమెరికాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ ట్రంప్ సైనిక చర్యకు దిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ నేత మదురో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత జాన్ గ్వైడో, అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు ఆరోపించాయి. మదురో పదవి నుంచి తప్పుకుని స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరాయి. దీనికి మదురో అంగీకరించకపోవడంతో ఆంక్షలు విధించాయి.