ఏం జరిగిందో నాకు తెలియదు... అంతా కోహ్లీ చలవే!: హ్యాట్రిక్ పై బుమ్రా వ్యాఖ్యలు
- విండీస్ తో రెండో టెస్టులో బుమ్రా హ్యాట్రిక్
- రోస్టన్ చేజ్ ను నాటౌట్ గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్
- కోహ్లీ డీఆర్ఎస్ కోరడంతో చేజ్ అవుటైనట్టు వెల్లడి
- హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న బుమ్రా
విండీస్ చేజార్చుకున్న 7 వికెట్లలో 6 వికెట్లు బుమ్రా ఖాతాలోకే వెళ్లాయంటే ఈ పేసర్ ఏ రేంజ్ లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. దీనిపై బుమ్రా మాట్లాడుతూ, వాస్తవానికి హ్యాట్రిక్ వస్తుందని తాను అనుకోలేదని, రోస్టన్ చేజ్ ప్యాడ్లకు బంతి తాకడంతో తాను అప్పీల్ చేశానని, అయితే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడని తెలిపాడు. కానీ విరాట్ కోహ్లీ అది అవుటేనని బలంగా నమ్మడంతో పాటు వెంటనే డీఆర్ఎస్ కు అప్పీల్ చేశాడని బుమ్రా వివరించాడు.
ఆ సమయంలో నిజంగా ఏం జరిగిందో తాను అర్థం చేసుకోలేకపోయానని, అప్పీల్ చేయాలని తాను అనుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ కోహ్లీ ముందుకొచ్చి డీఆర్ఎస్ కోరడంతో కథ మారిందని అన్నాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో అది అవుట్ అని తేలడంతో తనకు హ్యాట్రిక్ వికెట్ లభించిందని, తన హ్యాట్రిక్ చలవ కోహ్లీకే చెందుతుందని పేర్కొన్నాడు.