అమానుషం...భార్యాబిడ్డల్ని చంపేసి.. కిరోసిన్‌పోసి నిప్పంటించాడు
- ఆస్తికోసం ఓ భర్త దారుణం
- చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
- స్థానికుల చొరవతో బయటపడ్డ ఘాతుకం
మహారాష్ట్రలోని బెజుల్‌వాడికి చెందిన కవిత(28)కు కసర్‌గుత్తికి చెందిన చింతకి వెంకట్‌రెడ్డితో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి దినేష్‌రెడ్డి అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. మద్యానికి బానిసైన వెంకటరెడ్డి తరచూ భార్యతో గొడవపడేవాడు. తమకున్న ఐదెకరాల్లో ఎకరా భూమిని ఇటీవల వెంకట్‌రెడ్డి అమ్మి జల్సాలకు ఖర్చుచేసేశాడు. దీన్ని గమనించిన కవిత ఉన్న నాలుగు ఎకరాలు కూడా భర్త అమ్మేసి దుబారా చేస్తాడన్న భయంతో పెద్దలను ఆశ్రయించి వారి సాయంతో తన పేరున పట్టా చేయించుకుంది.
ఆ భూమిని సైతం అమ్మేందుకు వెంకట్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కవిత అడ్డుకుంటుండడంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించాడు. బుధవారం మధ్యాహ్నం ఆమె గొంతునులిమి హత్య చేశాడు. దీన్ని కొడుకు గమనించడంతో ఎవరికైనా చెబుతాడన్న భయంతో బిడ్డను కూడా పీకపిసికి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఊర్లో తిరుగుతూ రాత్రికి ఇంటికి వచ్చాడు.
తర్వాత భార్యాబిడ్డలపై కిరోసిన్ పోసి నిప్పంటించి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఏడవడం ప్రారంభించాడు. అయితే అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు దారుణం బయటపడింది.