లాకరా.. నగల షాపా?: మోటారు ఇన్స్పెక్టర్ బ్యాంకు లాకర్ల నుంచి బయటపడుతున్న కిలోల కొద్దీ బంగారం!
- నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు
- గుట్టలుగుట్టలుగా బయటపడిన బంగారు నగలు
- నేడు మరికొన్ని లాకర్లను తెరవనున్న ఏసీబీ
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని రెండు లాకర్లలో మొత్తం 1.8 కిలోలు, ఎస్బీఐ లాకర్లో 1.3 కిలోల బంగార వస్తువులు బయటపడ్డాయి. 10కిలోల వెండి వస్తువులు కూడా వెలుగుచూశాయి. నేడు మిగిలిన రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉంది. బయటపడిన బంగారు వస్తువుల్లో నెక్లెస్లు, గాజులు, చెవి రింగులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, జడపాయలు, వడ్డాణం, దండవంకీలు, హారాలు, గొలుసులు.. ఉన్నాయి.
ఇవి కాకుండా 400 గజాల ఖాళీ స్థలం, మరో రెండు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా లాకర్లలో లభ్యమయ్యాయి. ఈ సోదాల్లో మొత్తం మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వెంకటరావు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లపై గత శనివారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.