Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముందే వెళ్లిపోతున్న అతిథి విహంగాలు

ప్రతి శీతాకాలంలోనూ బెంగుళూరు నగరాన్ని తమ విడిదిగా చేసుకుని నగర పర్యాటకుల్ని అలరిస్తుండే విహంగ అతిథులు ఈ దఫా ముందే తిరిగి తమ తమ దేశాలకు వెళ్లిపోతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో వచ్చి మేనెల రెండో వారం వరకు బెంగుళూరు నగరంలోనే ఉండే.. వలస పక్షులు ఇక్కడ చెరువులు, తదితర ప్రాంతాల్లో నివాసయోగ్య పరిస్థితులు దిగజారడం వల్ల కొన్ని వారాల ముందుగానే తిరిగి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. నగరంలో చెరువులన్నీ మురికి గుంటలుగా మారుతున్నాయని అందువల్లనే పక్షులు వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం నగరంలో సరస్సుల్ని సంరక్షించే చర్యలు జీవవైవిధ్య సంరక్షణకు అనుకూలంగా లేవని, ఇక్కడి నీటివనరుల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయని బెంగుళూరులోని పక్షుల నిపుణుడు ఎస్‌.సుబ్రమణ్య చెబుతున్నారు. ఒకప్పుడు శుభ్రమైన నీటితోఉండే నగరంలోని చెరువులు ఇప్పుడు మురికినీటి, డ్రైనేజీ గుంతల్లా మారుతున్నాయని అంటున్నారు.

ఉదాహరణకు బెంగుళూరులోని హెబ్బల్‌ సరస్సునే తీసుకుంటే.. గతంలో ఇక్కడ ఏటా సుమారు రెండువేలకు పైగా నార్తర్న్‌ షోవెలర్స్‌, యూరేసియన్‌ గార్గనీస్‌ అనే జాతుల పక్షులుండేవి. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అని ఆర్నితాలజిస్టు ఎంబి కృష్ణ చెబుతున్నారు. వీటికి తోడు వలసపక్షులు త్వరగా వెళ్లిపోవడానికి వాతావరణంలో మార్పులు కూడా కారణం అవుతున్నాయిట.

More Telugu News