Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడి ప్రపోజల్ కు ఓకే అన్న యువతి.. ఉద్యోగం నుంచి పీకేసిన కంపెనీ!

  • చైనాలో విచిత్ర ఘటన
  • విమానంలో ప్రపోజ్ చేసిన యువకుడు
  • ఉద్యోగినిని తొలగించిన విమాన కంపెనీ
ప్రియురాలికి ‘ఐ లవ్ యూ’ చెప్పడానికి చాలామంది విభిన్నంగా ట్రై చేస్తుంటారు. కొందరు లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్లి తమ ప్రేమను వ్యక్తపరిస్తే, మరికొందరేమో ఖరీదైన బహుమతులతో ప్రపోజ్ చేస్తారు. ఇంకొందరు మాత్రం జనాల రద్దీ బాగా ఉండే ప్రాంతాల్లో ప్రియురాలికి ఐ లవ్ యూ చెప్పేస్తారు. కానీ చైనాలో ఉండే ఓ వ్యక్తి మాత్రం తన ప్రియురాలికి విమానంలో ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె కూడా దానికి సంతోషంగా అంగీకరించింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో సదరు యువతిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. చైనాలో ఐదు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ లో ఓ యువతి ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె విధులు నిర్వహిస్తున్న విమానంలోకే ఎక్కిన  ప్రియుడు.. టేకాఫ్ అయిన అరగంట తర్వాత లేచి ప్రపోజ్ చేశాడు. దీంతో షాక్ కు గురైన యువతి, ఆ తర్వాత పెళ్లి ప్రతిపాదనకు అంగీకరించింది. దీన్ని విమానంలో ఉన్న కొందరు ప్రయాణికులు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కంపెనీ దృష్టికి రావడంతో ఆ సంస్థ యాజమాన్యం ఉద్యోగినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రయాణికులకు సేవలు అందించకుండా వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టడంతోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
china
eastern airlines
love proposal
lost job

More Telugu News