దాచేపల్లి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాచేపల్లి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు

  • పరారీలో ఉన్న నిందితుడిని పట్టిస్తే నగదు బహుమతి
  • దాచేపల్లికి వెళ్లాలని మంత్రులు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు ఆదేశాలు
  • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్
గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను ఈ మేరకు ఆదేశించారు.

దాచేపల్లిలో స్థానికుల ఆందోళన 

నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు దాచేపల్లిలో ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన స్థానికులు

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడి ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. కాగా, నిందితుడిని అరెస్టు చేయాలంటూ గుంటూరు లోని జీజీహెచ్ ఎదుట ప్రజా, మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నిందితుడిని ఉరితీయాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ, సీపీఎంతో పాటు మహిళా, ప్రజాసంఘాలు నినదించాయి. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

బాలికను పరామర్శించిన కలెక్టర్ 

బాలికకు వైద్య చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరామర్శించారు. బాలిక ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలందించాలని కోన శశిధర్ ఆదేశించారు.

 అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోక్సో చట్టం కింద బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఐసీడీఎస్, డీఆర్డీఏ, విద్య, మెప్మా వంటి అన్ని శాఖల అధికారులతోనూ శనివారం సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.
Andhra Pradesh
Chandrababu
dachepallii incident

More Telugu News