దయచేసి మీ ప్రకటనల కోసం పగ్ కుక్కల్ని బాధించకండి... వొడాఫోన్ కు పెటా సూచన
- అవి సాధారణ కుక్కలు కావు
- జన్యుపరంగా మార్పులు చేసినవి
- శారీరకంగా ఎన్నో బాధలు అనుభవిస్తుంటాయి
- ఏ జంతువును కూడా ప్రకటనల కోసం వాడుకోవద్దు
- వొడాఫోన్ ను లేఖ ద్వారా కోరిన పెటా
‘‘పగ్స్ అన్నవి చూడ్డానికి చాలా అందంగా ఉండేందుకు జన్యుపరంగా మార్పులు చేసి రూపొందించిన జాతి. ఈ విధమైన నిర్మాణం వల్ల అవి నిరంతరం నొప్పిని అనుభవిస్తూ, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటాయి. జన్యుపరంగా చేసిన మార్పుల కారణంగా అవి చిన్న ముక్కులు, చర్మం ముడతలతో కనిపిస్తాయి’’ అని లేఖలో పెటా వివరించింది. ‘మీ వాణిజ్య ప్రకటనల వల్లే భారత్ లో వీటికి ఆదరణ లభించిందంటూ, వాటి గురించి భారతీయులు తెలుసుకోగలిగారని’ అందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసింది.
పగ్స్ సహా ఏ జంతువును కూడా ప్రకటనల్లో వాడకుండా ఓ విధానాన్ని తీసుకురావాలని వొడాఫోన్ ను కోరింది. పగ్స్, జంతువులను వినోదం కోసం వినియోగించడం వల్ల, షూటింగ్ సమయాల్లో పెద్ద శబ్దాలు, అధిక కాంతితో కూడిన లైట్లు, లెక్కకు మించిన షాట్లను అవి ఎదుర్కోవాల్సి ఉంటుందని పెటా సీఈవో మనీలాల్ వాలియెత్ గుర్తు చేశారు.