కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి

  • కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య
  • పథకం ప్రకారం హత్య చేశారన్న కోమటిరెడ్డి
  • రాజకీయ నేతల హస్తం ఉందని ఆరోపణ
తన ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురికావడంతో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య ఉదంతాన్ని తెలుసుకున్న ఆయన, హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. శ్రీనివాస్ పై ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా, తనతోపాటే నడుస్తూ వచ్చాడని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు కుడిభుజంగా ఆయన నిలిచాడని, ఆయన లేనిలోటు తనకు తీరనిదని చెప్పారు.

శ్రీనివాస్ హత్యకు కుట్ర జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఈ హత్య జరిగిందని, ఈ ఘటన వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని అన్నారు. ఓ వ్యక్తిని ఒంటరిని చేసి చంపడం పిరికి చర్యని నిప్పులు చెరిగారు. హత్య వెనక ఉన్నవారు ఎవరైనా వారిని చట్టం ముందు నిలపాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Komatireddy Venkatareddy
Boddupalli Srinivas
Murder
Nalgonda District

More Telugu News