అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే, జరిమానా చెల్లించలేనని ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టుకు తెలిపారు. డబ్బు కట్టకపోవడానికి కారణమేంటంటూ ధర్మాసనం ప్రశ్నించగా... డేరాబాబా తరపు వాదిస్తున్న లాయర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

 డేరా సంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని... ఈ నేపథ్యంలో ఆయన రూ. 30 లక్షలను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అయితే, ఈ వాదనను హైకోర్టు కొట్టిపారేసింది. పంచకుల కోర్టు ఆదేశించిన విధంగా రెండు నెలల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని అత్యాచార బాధితులకు చెల్లించనున్నారు. మరోవైపు, డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష సరిపోదని... యావజ్జీవ కారాగార శిక్షను విధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వీరు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా పంజాబ్-హర్యానా హైకోర్టు విచారణకు స్వీకరించింది.